ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పవన్ కళ్యా్ణ్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు.. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకారాన్ని కోరారు. వీటిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలలో గండికోట కూడా ఉన్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసే విషయమై కేంద్ర మంత్రి షెకావత్ వద్ద పవన్ కళ్యాణ్ పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. దీనికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే ఇటీవల తిరుపతిలో ప్రకటించిన వారాహి డిక్లరేషన్‌ను కూడా పవన్ కళ్యాణ్ గజేంద్ర సింగ్ షెకావత్‌కు అందజేశారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.
మరోవైపు వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాంతం పర్యాటకంగా ఎంతో పేరు సంపాదించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు గండికోటను చూడ్డానికి వస్తుంటారు. టెంట్లు వేసుకుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గండికోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా అడ్వెంచర్ టూరిజానికి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి.
ఎత్తైన కొండలు, లోయలతో.. సాహస కార్యక్రమాలకు గండికోట అనువుగా ఉంటుంది. ఈ క్రమంలోనే గండికోటలో సీప్లేన్ సర్వీసును కూడా అందుబాటులోకి తేవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే విజయవాడ శ్రీశైలం సీప్లేన్ సర్వీసు ప్రారంభించగా.. దీనిని గండికోట వరకూ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన శిల్పకళకు, చారిత్రక వైభవానికి ప్రతీక అయిన గండికోటను మరింత అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద పవన్ కళ్యాణ్ గండికోట విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు.