ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేసిన వ్యవహారంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేసినా వర్మ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. నవంబరు 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలియజేస్తూ.. నటులతో దిగిన ఫొటోలను వర్మ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని వర్మ లీగల్ టీం పోలీసులకు తెలియజేసింది. కాగా, వర్మకు ఓ స్టార్ హీరో ఆశ్రయం కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది.