ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్‌కు అవమానమే జరుగుతోందని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కూటమి నేతలు అంబేద్కర్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు.
విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్‌పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.