వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ.... గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నిత్యం ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమార్ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నారు. దీంతో.. 2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దాడి జరిగిందంటూ అప్పట్లో నానా హంగామా చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తాజాగా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గతంలో నమోదుచేసిన సెక్షన్–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీరును తప్పుపడుతూ సెల్ఫ్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మరిన్ని అరెస్టులు చేయటానికి ప్రభుత్వం సిద్ధం అవ్వడం వెనుక దాగిఉన్న కుట్రని బయటపెడతాం అని తెలిపారు.