అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 29 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోకుండా చూడాలి. రైతులకు టార్పన్లు, టెంట్‌లు, గోనె సంచులు, ఇతర అవసరమైన వసతులను అందించాలి. అన్ని కేంద్రాల్లోనూ వచ్చిన ధాన్యం సేకరించాలి.
మెళియాపుట్టిలో 1000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమిని సేకరించి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలి. కేంద్ర నిధులతో ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అందుకోసం ఎకరా చొప్పున భూమిని సేకరించాలి. ఆయా చోట్ల ఇండోర్, ఔట్‌డోర్ కోర్టులను నిర్మిస్తాం. పల్లె పండుగలో శంకుస్థాపన చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’ అని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, డీపీఓ భారతి సౌజన్య, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, సీపీఓ ప్రసన్నలక్ష్మి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి పాల్గొన్నారు.