వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయాష్ వివాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకూ వెళ్లింది. ఫ్లైయాష్ కోసం కూటమి నేతలు మధ్య పోటీ పెరగడం, పోలీసుల మోహరింపు నేపథ్యంలో కూటమి నేతలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యినట్లు తెలిసింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటుగా.. జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. దీనిపై అధికారుల నుంచి వివరాలు కూడా సేకరించినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వస్తే.. వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయాష్‌ను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు.. ఈ ఫ్లైయాష్‌ను సిమెంట్ కంపెనీలకు తోలుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఇటీవల అడ్డువచ్చారు. దీంతో ఆర్టీపీసీ ఉచిత ఫ్లైయాష్ కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య పోటీ మొదలైంది.
టన్నుల కొద్దీ భయపడుతున్నాడు.. మాఫియా డాన్ అంట.. ఆర్జీవీపై కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే ఫ్లైయాష్‌ను తాడిపత్రిలోని సిమెంట్ పరిశ్రమలకు రానీయకుండా జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు ఫ్లైయాష్ కోసం ఆర్టీపీపీ వద్దకు వచ్చినా లోడింగ్ చేయకుండా నిలిపేశారు. కాంట్రాక్టులో తమకు సగ భాగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీపీపీ వద్ద ఫ్లైయాష్ లోడింగ్ ఆగిపోయింది. దీంతో తమ లారీలకు ఫ్లైయాష్ లోడ్ చేయాలని, లేకపోతే తామే జేసీబీలతో లోడ్ చేసుకుంటామంటూ జేసీ వర్గీయులు పట్టుబట్టారు. అప్పటి వరకూ కదిలేది లేదంటూ అర్టీపీపీ వద్దే లారీలను నిలిపివేశారు.
అటు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం ఈ విషయంలో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. బుధవారం లోగా తమ లారీలకు ఫ్లైయాష్ నింపకపోతే తానే వస్తానంటూ స్పష్టం చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీపీ వద్దకు వస్తారనే సమాచారంతో పోలీసులు.. ఆర్టీపీపీ వద్ద, తాడిపత్రి మార్గంలో బలగాలను మోహరించారు. కొండాపురం, ముద్దనూరు, తాళ్ల పొద్దుటూరు ప్రాంతాల్లోనూ బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం కాస్తా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు నేతలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.