టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో పులి సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందిందని ఆయన తెలుసుకుని వెంటనే అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒరిస్సా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించి, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు అధికారులు.కాగా, ఇటీవల ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ యువకుడిపై పెద్దపులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరువకముందే సంతబొమ్మాలి మండలం హనుమంతు నాయుడుపేట పంచాయతీ పెద్ద కేశినాయుడుపేటకు చెందిన భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవుపై గత రాత్రి పులి దాడి చేసి చంపేసింది.వెంటనే అలర్ట్ అయిన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. టెక్కలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరూ పొలాలకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి స్థానికులను హెచ్చరించారు.