గత జగన్ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దర్యాప్తు నివేదికను నెల రోజుల్లో అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.అయితే 2019 నుంచి 24 మధ్య టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా మార్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో.. అంటే 2017-19 లో ఎంపిక చేసిన లబ్దిదారులను మార్చేసి 2019 - 24లో కొత్తవారిని ఆ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద లబ్దిదారుల డీడీలను బ్యాంకుల్లో సైతం సమర్పించక పోవటంపై కూడా విచారణ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.