ప్రజలను నట్టేట ముంచేందుకు పలు సంస్థలు, వివిధ యాప్‌లు పట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. వాటి మాయలో పడి ప్రజలు మోసపోతునే ఉన్నారు. అయినా అవి పుట్టుకు రావడం మాన లేదు.. వాటి మాయలో ప్రజలు పడడం ఆగ లేదు. అలా మాయలో పడి దాదాపు 200 మంది ప్రజలు బాధితులుగా మారిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డోన్ పట్టణానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాడు. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్థానికులకు ఆశ చూపాడు.
దీంతో భారీగా ప్రజలు రామాంజనేయులు మాటలు నమ్మారు. ఆ క్రమంలో భారీగా నగదు అతడికి ముట్ట జెప్పారు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, స్థలాలు విక్రయించి.. భారీగా నగదు అతడి చేతిలో పొశారు.అయితే గత కొంత కాలంగా రామాంజనేయులు ఫోన్ ఎత్తడం మానేశాడు. దీంతో అనుమానించిన ప్రజలు.. అతడి కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ఆ కార్యాలయానికి తాళం దర్శనమిచ్చింది. దీంతో తాము నిలువునా మోసపోయామని బాధితులు గ్రహించారు. దాంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 200 మంది బాధితులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దాదాపు రూ. 40 కోట్ల మేర రామాజంనేయులు వద్ద బాధితులు పెట్టుబడిగా పెట్టారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.