నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇది మరింత బలపడి రానున్న ఆరు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మధ్యాహ్నానానికి పుదుచ్చేరి వద్ద ఈ తుఫాన్ తీరాన్ని తానుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఆయా జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక రెండు రోజులు.. రాయలసీమతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రాంతంలోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక.. అలాగే రాష్ట్రంలోని మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. మరోవైపు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.