ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, పౌర సేవలతో, వివిధ కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు, లోటుపాట్లపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. మెరుగైన సేవల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాల్లో ఏ అంశం గురించి అయినా ప్రజల నిర్ణయమే అంతిమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత సామాజిక భద్రత పింఛన్లు పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఉచిత ఇసుక వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే నూతన మద్యం విధానం సైతం తీసుకువచ్చింది. ఈ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని.. వారిచ్చే రేటింగ్ ఆధారంగా మార్పులు, చేర్పులు ఉంటే చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసమే ఐవీఆర్ఎస్ విధానం ద్వారా పథకాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రజల్లో సంక్షేమ పథకాల అమలు గురించి ఎలాంటి అభిప్రాయం ఉందనే సంగతి తెలుస్తుంది. అలాగే ఇంకా మెరుగ్గా ఏమైనా చేయగలమా అనే విషయంలోనూ సూచనలు లభిస్తాయి.
డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 3వ తేదీ జరగనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం డిసెంబర్ 4వ తేదీ ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఒకరోజు ముందుగానే ఈ నెల మూడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా ఖరారు చేసేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలలోగా ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీతో పాటు వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం.
![]() |
![]() |