ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ నెల నుంచి ప్రజలపై రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం మోపుతున్నారని, ప్రతి యూనిట్ కు సగటున రూ.1.25 పెంచుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ త్వరలోనే తన విధానాన్ని ప్రకటించబోతోందని, తమ పార్టీ ప్రజాగళాన్ని వినిపిస్తుందని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా రూ.6,072 కోట్ల భారాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారు. అంటే మొత్తంగా రూ.15,485 కోట్ల మేర విద్యుత్ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలి అని డిమాండ్ చేసారు.