మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోక ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ చెప్పారు. ఈ పథకం అమలుపై త్వరలోనే మహిళలకు శుభవార్త చెబుతామన్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలు ప్రకటిస్తామని వెళ్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, మెరుగైన సేవలతో పాటుగా ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే 1600 నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. 1600 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందన్న ఆయన.. ఇప్పటికే 900 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగతా వాటిని కూడా త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దెబ్బతిన్న ఆర్టీసీ బస్టాండ్లలో మరమ్మత్తులు చేస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద సంఖ్యలో నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు అర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వస్తుందంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆ దిశగా అడుగులు పడలేదు. ఆ తర్వాత దీపావళికి ప్రారంభిస్తారని ప్రచారం జరగ్గా.. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు పరిశీలించిన తర్వాతే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ తరహాలో అమలు చేయాలా లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అంతర జిల్లాల సర్వీసులకే పరిమితం చేయాలా అనే ఆలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ స్కీమ్ అమల్లోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa