ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలిపిరి దగ్గర పుష్ప2 పాటకు యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 08:16 PM

తిరుమలలో మరోసారి ఇన్‌స్టా రీల్ కలకలం రేపింది. తిరుమలకు వెళ్లే మార్గంలో.. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర ఓ యువతి సినిమా పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ యువతి పుష్ప 2 సినిమాలో పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ రికార్డ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. యువతి సినిమా పాటకు శేషాచలం కొండలు బ్యాక్ గ్రౌండ్‌తో డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్‌‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి.. ఎలాంటి పాటలు, నినాదాలు వినిపించకూడదు. అయినా సరే కొందరు నిబంధనల్ని ఉల్లంఘించి రెచ్చిపోతున్నారు.. ఇటీవల వరుస ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల పాపవినాశనం దగ్గర ఓ మతానికి చెందిన కొందరు తమ మతం గురించి ప్రచారం చేసే విధంగా పాటలతో రీల్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతవారం అన్యమతనానికి చెందిన వ్యాఖ్యలు రాసిన ఉన్న ఓ కారు తిరుమలకు రావడంపై విమర్శలు వచ్చాయి.


అలాగే బిగ్‌బాస్ ఫేమ్‌, సీరియల్స్ నటి ప్రియాంక జైన్, నటుడు శివకుమార్ కూడా తిరుమలలో వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలకు వెళ్తూ అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి దగ్గరు చిరుతపులి కనిపించిందని ప్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యింది. వీరిద్దరు భక్తులను భయాందోళలకు గురి చేసే చర్యలకు పాల్పడటంపై వారిపై విమర్శలు వచ్చాయి. దీంతో వారిద్దరు క్షమాపణలు చెప్పారు. తాము షేర్ చేసిన వీడియోపై శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారని.. తాము తెలియక ఈ తప్పు చేశామన్నారు. అందరి మనోభావాలను గాయపరిచినట్లయితే ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నామన్నారు.


తాము ఉద్దేశపూర్వకంగా వీడియో చేయలేదని.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మాత్రమే చేశామన్నారు. ఇలా అవుతుందని తాము అనుకోలేదని.. ఇంతమంది మనోభావాలను హర్ట్‌ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదన్నారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను తాము తక్కువ చేయాలని అనుకోలేదని.. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు ఇకపై తాము చేయబోమన్నారు. తెలియకుండా జరిగిన ఈ తప్పును అందరూ క్షమించాలని కోరారు. మరోసారి ఈ తప్పు జరగదన్నారు.


అలాగే రెండు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు సెల్ఫీ విన్యాసాలు చేయడం కలకలంరేపింది. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కొందరు యువకులు కార్ డోర్ తీసి సన్‎రూఫ్, సైడ్ విండోల నుంచి బయటకు నిలబడి రెచ్చిపోయారు. కొందరు వీరి ఘనకార్యాన్ని వీడియో తీయడంతో బయటపడింది. అంతకుముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు పర్సనల్ ఫోటోగ్రాఫర్స్‌తో ఫోటోషూట్ చేయడం వివాదాస్పదం అయ్యింది.. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కడప జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత వంశీనాథ్ రెడ్డి ఫోటోషూట్ కూడా వివాదాస్పదం అయ్యింది. ఇలా తిరుమలలో వరుస ఘటనలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com