అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని, వినియోగించడాన్ని నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం ప్రకటించారు. ఏ హోటల్ లేదా రెస్టారెంట్ లేదా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ లేదా పబ్లిక్ ప్లేస్ లో గొడ్డు మాంసం వినియోగం నిషిద్ధమని స్పష్టం చేశారు. ''అస్సాంలో ఏ రెస్టారెంట్, హోటల్లో బీఫ్ వినియోగించకూడదని, పబ్లిక్ ఫంక్షన్లు, పబ్లిక్ ప్లేస్ లలో బీఫ్ ను వడ్డించరాదని నిర్ణయించాం. కాబట్టి, ఈ రోజు నుండి, హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలలో గొడ్డు మాంసం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మేము నిర్ణయించుకున్నాము'' అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
దేవాలయాల దగ్గర గొడ్డు మాంసం తినడాన్ని నిలిపివేయాలని గతంలోనే అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్రమంతటికి విస్తరించామని, కమ్యూనిటీ ప్లేస్, పబ్లిక్ ప్లేస్, హోటల్, రెస్టారెంట్లలో బీఫ్ వినియోగాన్ని నిషేధించామని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శర్మ తెలిపారు. బీఫ్ బ్యాన్ ను స్వాగతించాలని, లేదంటే పాకిస్థాన్ వెళ్లి స్థిరపడాలని అస్సాం కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్నట్లు అస్సాం మంత్రి పిజుష్ హజారికా తెలిపారు. అస్సాంలో బీఫ్ ను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా లేఖ రాస్తే తాను సిద్ధంగా ఉన్నానని శర్మ కొద్ది రోజుల క్రితం చెప్పారు.