కారు కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే తీసుకునేందుకు ఇదే మంచి సమయం. దేశంలోని అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతి సుజుకి జనవరి నుంచి ధరల పెంపునకు సిద్ధమైంది. తయారీ, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండడంతో వాటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు అన్ని రకాల మోడళ్లపై ధరలు పెంచాలని నిర్ణయించింది. మోడల్‌ను బట్టి నాలుగు శాతం వరకు ధరలు పెంచనున్నట్టు తెలిపింది. నిర్వహణ, తయారీ ఖర్చులు తగ్గించుకుని వినియోగదారులపై భారం పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పెరిగిన వ్యయాన్ని కొనుగోలుదారులపైకి మళ్లించక తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది. మారుతి సుజుకి ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వేగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఆల్టో కే10, ఎస్-ప్రెసో మోడళ్లను విక్రయిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బ్రెజా, ఎకో, ఎర్టిగాతోపాటు ఎంపీవీ సెగ్మెంట్‌లో అరేనా ఉంది. నెక్సా అవుట్‌లెట్లలో ఇగ్నిస్, బాలెనో, ఫ్రోంక్స్, సియాజ్, ఎక్స్ఎల్6, జిమ్నీ, ఇన్విక్టోలు విక్రయిస్తోంది. మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మరో కార్ల మేకర్ హ్యుందాయ్ కూడా పలు మోడళ్ల ధరలు పెంచింది. కొత్త ధరలు జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మోడళ్లను బట్టి కనీసం రూ. 25 వేలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, లగ్జరీ కార్ మేకర్లు అయిన ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటివి కూడా కార్ల ధరలను పెంచాయి.