ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో డీప్ టెక్ సదస్సు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 09:32 PM

అత్యాధునిక సాంకేతికత–ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం నాడు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫార్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 'షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్' అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశామనేది వివరించారు.  1996లో ఐటీ గురించి మాట్లాడిన నేను, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచాం. నాడు పైసా ఖర్చు లేకుండా కేవలం భూమి మాత్రమే ఇచ్చి పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించాం.  నాడు ఉమ్మడి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడానికి అమెరికా వెళ్లి ఐటీ పెద్దలను కలిసి భారతీయుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యం గురించి వివరించాను.  అప్పటి వరకు 20 విద్యా సంస్థలు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 నుండి 250 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహించాం. నాడు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్ ఎలా తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు.  ప్రస్తుతం అందరం డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. టెక్నాలజీ అనేది ఒక విప్లవం లాంటిది.  నేను స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యత గురించి మాట్లాడితే నన్ను ప్రశ్నించారు. కానీ నేడు మన జీవితంలో టెక్నాలజీ భాగమైంది. ఐటీని ఉపయోగించుకోకపోయి ఉంటే ఆర్థిక వ్యవస్థలో మిగతా దేశాలతో పోటీ పడేవాళ్లం కాదు.  ఇక డీప్ టెక్‌లో ఏఐ, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి విధానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఇప్పుడు ఎలా ఉపయోగించాలనేది ముఖ్యం.రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తాం. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి డీప్ టెక్‌ ఎగ్జిబిషన్ నిర్వహిస్తాం. భారతదేశంలో తప్ప ఏ దేశంలోనూ ఆధార్ విధానం లేదు. ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల అద్భుతాలు చూస్తున్నాం. ప్రధాని మోదీ భారతదేశాన్ని గర్వించేలా చేశారు. మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా మోదీ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు.మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు గంట ప్రాతిపదికన లేదా మీకు నచ్చిన సమయంలో హైబ్రిడ్ మోడల్ లో పని చేయవచ్చు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని బలమైన సంకల్పంతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్దమొత్తంలో డేటా ఉంది. ఏఐ ద్వారా తక్కువ సమయంలోనే సరైన నిర్ణయాన్నితీసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేసేందుకు సందేశం పంపడంతో పాటు, పంట తెగుళ్లను గుర్తించవచ్చు.  తెగుళ్ల నివారణకు డ్రోన్ ద్వారా పురుగుమందులను తక్కువ సమయంలో పిచుకారీ చేయడంతో పాటు అనర్ధాన్ని తగ్గించవచ్చు. డ్రోన్‌ ద్వారా నిఘా పెట్టి శాంతి భద్రతలు కాపాడటానికి, ఇంకా వైద్య సేవల కోసం కూడా ఉపయోగించి వైద్య ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు.ప్రస్తుతం మేము స్వర్ణాంధ్ర 2047 విజన్‌ సిద్ధం చేస్తున్నాము. అందులో 10 ప్రణాళికా సూత్రాలను ప్రధానంగా తీసుకొన్నాం. విజన్ ప్రకారం 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేసి సాధిస్తాం. గత ఐదేళ్ల అసమర్థ పాలన వల్ల కొన్ని వారసత్వ సమస్యలు తలెత్తాయి. వాటిని సరిదిద్దుతున్నాం.  P4 విధానంతో పేదరికాన్ని రూపుమాపవచ్చు. దేశానికి జనాభానే ఒక ఆస్తి. జనాభా సమతుల్యత గురించి అందరూ ఆలోచన చేయాలి. కొరియా, జపాన్, యూరప్ దేశాల్లో జనాభా లేమి సమస్య తలెత్తింది. యువ జనాభా తగ్గిపోతుండడం... వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ దేశాలు కలవరపడుతున్నాయి.   భారతీయ ఐటీ నిపుణుల్లో అత్యధికులు ఏపీ, తెలంగాణకు చెందినవారే ఉన్నారు. రానున్న రోజుల్లోనూ సాంకేతికరంగంలో తెలుగువారిదే పైచేయిగా నిలవాలి.  జనాభా, సాంకేతికతను సక్రమంగా నిర్వహించినట్లయితే భారతదేశం ప్రపంచానికే సేవా కేంద్రంగా మారుతుంది.అధిక సంపద కలిగిన వారు పేదలను దత్తత తీసుకుంటే వారు కూడా ఉన్నత స్థాయిలోకి వస్తారు. తద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. దీనికోసం అందరూ చేతులు కలపాలి. పేదరికాన్ని రూపుమాపి అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డీప్ టెక్‌తో మనం ఉపాధి మార్గాలను సృష్టించగలం. సాంకేతికతను నమ్ముకుంటే ఉపాధికి కొదవ ఉండదు. డీప్ టెక్ ద్వారా సంపదను సృష్టించగలం. దీని కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ లో ఉపాధిని సృష్టించడానికి కో-వర్కింగ్ స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాం.  స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కోసం ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ విద్యా సంస్థలను తీసుకురాబోతున్నాం.  నాలెడ్జ్ ఎకానమీకి భవిష్యత్ నగరంగా వైజాగ్ సిటీ నిలుస్తుంది.  రాష్ట్రంలో నైపుణ్య గణన చేపట్టి స్కిల్స్ లేని వారికి శిక్షణ ద్వారా ఉపాధి మార్గాలు చూపిస్తాం. విద్యుత్ రంగంలో 1998లోనే సంస్కరణలు తీసుకొచ్చాను. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలు తెస్తున్నాము. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎవరైనా ఇంటి పైకప్పు మీద సోలార్ రూఫ్ టాప్ ద్వారా సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. గృహ అవసరాలకు పోను మిగిలింది గ్రిడ్ కు విక్రయించవచ్చు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. వైజాగ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి NTPC- APGENCO మధ్య ఒప్పందం జరిగింది.  ప్రస్తుతం 'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం... అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa