ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి డిస్కంలు.
2024-25తో పోలిస్తే3.93 శాతం అధికంగా 2025-26లో 75,926.22 ఎంయూల విక్రయాలుంటాయని అంచనా వేశాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు 12,927 మిలియన్ యూనిట్లు అవసరం అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కొనుగోలు వ్యయం రూ. 4.80 చొప్పున అంచనా వేశారు. ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ. 5.12 చొప్పున ఖర్చవుతోంది. 2025-26కు సంబంధించి ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుంది. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి.
గత వైఎస్సార్‌సీపీ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతి సచివాలయంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్ కో జేఎండీ కీర్తీ చేకూరి తో పాటు డిస్క్ం ల సీఎండీలు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆరు నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్ లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
'ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలి. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన చారిత్రాత్మక తప్పిదాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు గుది బండగా మారాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుంది.. అందుకు అనుగుణంగానే విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ ఎదురు కాకుండా చూడాలి. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో ఉత్పత్తిని.. డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి' అన్నారు.
'ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ కాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ.. లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి' అని సూచించారు మంత్రి.