ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. ఏపీలోని 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 09:19 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఐదు ముఖ్యమైన శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్.. అన్ని శాఖలలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామసభల నిర్వహణ, పల్లెపండుగ కార్యక్రమాలు వంటి విధానాలను పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గ్రామ పంచాయతీలను అవార్డులు వరించాయి. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌ కింద ఏపీలోని నాలుగు గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరిల కింద జాతీయ అవార్డులు దక్కాయి.


ఆరోగ్య విభాగంలో హెల్తీ పంచాయతీగా చిత్తూరు జిల్లా ఐరాలా మండలంలోని బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ అవార్డు దక్కించుకుంది. నీటి నిర్వహణలో మెరుగైన పనితీరును కనబరిచిన కారణంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామ పంచాయతీ వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. అలాగే అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామ పంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.


తొలిసారిగా జాతీయ స్థాయిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో 4 జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం ఆనందంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయం సమృద్ధి, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ, స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శమని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు, సభ్యులకు అభినందనలు తెలియజేశారు.


మరోవైపు తమ జిల్లాలోని రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కడంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆనందం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కడం ప్రశంసనీయమని వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. తన నియోజకవర్గం పాయకరావుపేటలోని న్యాయంపూడి గ్రామపంచాయతీ, అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామ పంచాయతీ కూడా ఉండడం గర్వకారణమంటూ అధికారులను అభినందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com