పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు ఎపిసోడ్ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేయడం.. షిప్‌ను సీజ్ చేయాలంటూ ఆదేశించడంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమ రవాణాను అడ్డుకోవటంతో పాటుగా ఇందులో పాత్రధారులు, సూత్రధారులపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ కోసం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహించనున్నారు. ఇక సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్‌తో పాటుగా డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, రత్తయ్య, బాలసుందర్‌రావులను నియమించారు. దర్యాప్తు కోసం సిట్ బృందానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 15 రోజులకు ఒకసారి దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
మరోవైపు సిట్ ఏర్పాటుపై వైసీపీ సెటైర్లు వేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే తిరుమల లడ్డూపై ఒక సిట్, గంజాయి వ్యవహారంపై ఈగల్ ఏర్పాటు చేశారని.. ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాపై సిట్ అంటున్నారంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రచారం కోసం ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందంటూ ఆరోపించారు. మరోవైపు బియ్యం రవాణాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఉన్నారంటూ అంబటి రాంబాబు మరోసారి ఆరోపించారు. వైసీపీ పార్టీ నేతలు లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.