భూకబ్జాకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి నారా లోకేష్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి తమ భూములను కబ్జా చేశారని వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులు శుక్రవారం మంత్రి లోకేష్‌ను కలిసి తమ గోడును వెల్లబోశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ భూములను ఎలా కబ్జా చేశారో మంత్రికి తెలియజేశారు.తమకు న్యాయం చేయాలని సదరు బాధితులు.. మంత్రి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం అండతో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 15 కుటుంబాలకు చెందిన రూ.200 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని పట్టణానికి చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాలనాయుడు దంపతులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.మదనపల్లె లేడీ డాన్ కట్టా సులోచనను బినామీగా పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లతో పట్టణంలో రూ.10 కోట్ల విలువైన తమ 50 సెంట్ల భూమిని ఆక్రమించి వేధిస్తున్నారని మంత్రి ఎదుట దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సులోచన అనుచరులు తమ స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తాము నిర్మించుకున్న ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడంతో పాటు అనుచరులతో భౌతికదాడులకు దిగుతున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. విచారించి తమ భూములను కాపాడటంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.