ఉత్తర కాలిఫోర్నియా తీరంలో తక్కువ జనాభా కలిగిన ఫెర్న్డేల్ పట్టణానికి పశ్చిమాన 39 మైళ్ల (63 కిలోమీటర్లు) దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 1,400 మంది జనాభా ఉన్న ఫెర్న్డేల్ పట్టణంలో భూకంపం సంభవించడంతో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. "ఇది పెద్ద భూకంపం. ప్రజలు చాలా వేగంగా భవనాల నుంచి బయటకు పరిగెత్తారు," అని ఫెర్న్డేల్ వాలంటీర్ ఫైర్ డిపార్ట్మెంట్ సభ్యుడు ట్రాయ్ ల్యాండ్ చెప్పారు.
ముంపు ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి సమయం అవసరమని అధికారులు చెప్పినప్పటికీ పెద్దగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకైతే సమాచారం లేదు. కానీ పలు దుకాణాల్లో పైన ఉండే వస్తువులు భూకంపం కారణంగా కిందపడిపోయాయి. ఇది దుకాణదారులకు నష్టం కలిగించింది. పరిస్థితులు కాస్త శాంతించిన అనంతరం ఫెర్న్డేల్ స్థానికులు, వ్యాపార యజమానులు విరిగిన క్రోకరీలు, వస్తువులను శుభ్రపరుస్తూ కనిపించారు. గవర్నర్ గావిన్ న్యూసమ్ ఉత్తర కాలిఫోర్నియాలో జరిగిన నష్టం గురించి ఆందోళన చెందుతున్నానని, ప్రభావిత ప్రాంతాలకు సహాయాన్ని సులభతరం చేసే విధంగా అత్యవసర ప్రకటనపై సంతకం చేశానని వెల్లడించారు.