ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. అద్భుతమైన బ్యాటింగ్, అసాధారణ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది.అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో మూడో రోజే టీమిండియా ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం సమర్పించుకోగా.. రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రాహుల్ (7), యశస్వి (24), విరాట్ కోహ్లి (11), శుభ్‌మన్ గిల్ (28), రోహిత్ శర్మ (6) చేతులెత్తేశారు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు వికెట్లకు 128 పరుగులతో ఉండగా.. ఇంకా 29 పరుగులు వెనుకబడే ఉంది. మూడో రోజు ఉదయం ఈ ఇద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారన్నదానిపై టీమిండియాకు ఆధిక్యం ఆధారపడి ఉంది.రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పేసర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. నాలుగో ఓవర్లో 12 పరుగుల దగ్గరే తొలి వికెట్ పడింది. రాహుల్ 7 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ నిర్మించేలా కనిపించినా.. అతడు కూడా 24 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.