పెళ్లిళ్లలో చికెన్, మటన్, గుడ్డు పెట్టలేదంటూ ఇప్పటి వరకు చాలానే గొడవలు జరిగాయి. ఈ గొడవల కారణంగా కొన్ని వివాహాలు ఆగిపోయాయి కూడా. కానీ తొలిసారి పెళ్లిలో లడ్డూలు పెట్టలేదని రచ్చ చేశారు బంధువులు. ఏదో తిట్టి నోరుమూసుకుంటే గొడవ సద్దుమణిగేదే. కానీ నోటికి పని చెప్పిన వాళ్లే చేతులకు కూడా పని చెప్పి.. లడ్డూలకు బదులుగా కాజు కట్లీ తయారు చేసిన వంటమనిషిపై దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని బలోతారాకు చెందిన సుఖ్‌దేవ్ ప్రజాపతి (42) తమ కుటుంబంలోని ఓ పెళ్లికి.. భోజనాల కాంట్రాక్టును గుజరాత్‌లోని సమర్వాడకు చెందిన వంట మనిషికి దేవమహేశ్వరి ప్రజాపతికి ఇచ్చారు. అయితే పెళ్లి బనస్‌కాంతాలో జరుగుతుండడం వల్ల కాంట్రాక్టు ఆయనకు అందింది. పెళ్లిళ్లో పెట్టాల్సిన కూరల లిస్టుతో పాటు లడ్డూలు కూడా చేయాలని సుఖ్‌దేవ్ ప్రజాపతి కాంట్రాక్టరుకు వివరించారు. ఇదే కాకుండా కాంట్రాక్టర్‌కు మరో పెళ్లి ఆర్డర్ వచ్చింది. అయితే వాళ్లు కాజు కట్లీ చేయాలని చెప్పారు.
రెండు ఆర్డర్లు ఒకరోజు రావడం, పెళ్లిళ్లు కూడా ఒకేరోజు ఉండడంతో దేవ మహేశ్వరి ప్రజాపతి కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యారు. ముఖ్యంగా సుఖ్‌దేవ్ ప్రజాపతి చేయమని చెప్పిన లడ్డూలకు బదులుగా కాజు కట్లీని వారి పెళ్లికి పంపాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించలేని అతడు.. భోజనాలు జరుగుతుండగా ప్రశాంతంగా ఓ చోట కూర్చున్నాడు. కానీ అప్పటికే బంధువులు.. పెళ్లిలో లడ్డూకు బదులుగా కాజు కట్లీ పెట్టారని గొడవ ప్రారంభించారు. తాము లడ్డూలు చేయమంటే ఇదెలా చేస్తారంటూ వంట మనిషి దేవమహేశ్వరి ప్రజాపతిని ప్రశ్నించారు.
అతడు కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్తున్న వినకుండా.. బంధువులు దుర్భషలాడడం మొదలు పెట్టారు. తాము అన్నకున్న దానికంటే కాజుకట్లీకి ఎక్కువ బడ్జెట్ అవుతుందంటూ రెచ్చిపోయి మరీ అతడిని కొట్టారు. దీంతో దేవమహేశ్వరి ప్రజాపతి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిపోయిన బంధువులు అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడే చికిత్సపొందతూ వంటమనిషి ప్రాణాలు విడిచాడు.
పెళ్లిలో గొడవ విషయం తెలియడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అయితే తాము నాలుగు దెబ్బలు మాత్రమే వేశామని చనిపోయేలా కొట్టలేదని బంధువులు వివరించారు. ఇదంతా విన్న పోలీసులు వైద్యులను సంప్రదించగా.. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. దేవమహేశ్వరి ప్రజాపతి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో.. ఆయనది సహజమరణమే అని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అలాగే పోస్టుమార్టం అనంతరం దేవమహేశ్వరి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలుసుకుంటామని అన్నారు. అలాగే గొడవకు భయపడడం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా విచారిస్తామని చెప్పుకొచ్చారు.