భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నమోదైంది. మంగళవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం కావాల్సి ఉండగా.. దాదాపు 70 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఇండియా కూటమి నేతలు సమర్పించారు. ఇక రాజ్యసభ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటుందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇక జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహార శైలి కారణంగా తాము తరచూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక ఈ తీర్మానంపై ఇండియా కూటమిలోని వివిధ పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలకు చెందిన 70 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారు.
ఇక ఎంపీల సంతకాలతో కూడిన ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను ఇండియా కూటమి నేతలు రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉండగా.. తమకు 70 మంది సభ్యుల మద్దతు ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రణజీత్ రంజన్ మీడియాకు వెల్లడించారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు.. రాజ్యసభ ఛైర్మన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని.. కానీ మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను జగదీప్ ధన్‌ఖడ్ తరచూ కట్ చేస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు వాదిస్తున్నారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం రాజ్యసభ నడవాలి కానీ.. తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు ఛైర్మన్ ధన్‌ఖడ్ ప్రయత్నిస్తున్నారు తప్ప నిబంధనలను పాటించాలని ఆయన భావించడం లేదని సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు.