ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వైసీసీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, నీటి ప్రాజెక్టుల పనులు అటకెక్కాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ రిజర్వాయర్‌ను మంత్రి ఆనం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. " సోమశిల జలాశయానికి అనుసంధారమైన హై లెవెల్ కెనాల్ పనులు 11 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నాం.
మెట్టప్రాంత ప్రజల కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు ఆటకెక్కాయి. జలాశయం నుంచి నీరు వృథాగా సముద్రానికి పోతున్నా వైసీపీ పాలకులు చూస్తూ ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైలెవల్ కెనాల్ పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు నీరు అందిస్తాం. పడమటి నాయకుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్‌ను 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేసి సోమశిల జలాలను అందిస్తాం. ఇప్పటికే భూసేకరణ చేపట్టాం. అధికారుల సమన్వయంతో పనులు చేసేందుకు ముందుకు సాగుతాం. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండల ప్రజల కల ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయి" అని అన్నారు.