బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ-నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక-తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 11 నుంచి 13 వరకు బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉంది. చాలా ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. దాంతో చలి పెరిగింది.