ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, మీడియా ప్రతినిధులకు నమస్కారాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.ప్రభుత్వ విజన్ ను ఎప్పటికప్పుడు తెలియజేయడం, ఇప్పటివరకు చేసిన పనులను సమీక్షించుకోవడానికి ఈ కలెక్టర్ల సమావేశాలు ఉపయోగపడుతుంటాయని వెల్లడించారు. "పెద్దగా సమస్యలు లేని రాష్ట్రంలో పాలన ఏమంత కష్టంగా ఉండదు. కానీ, రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగిన తర్వాత, దాన్ని పునర్ నిర్మాణం చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ దిశగా రెండోసారి కలెక్టర్లతో సమావేశమై సమీక్షించుకుంటున్నాం. పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు... ఇటీవల ఎన్నికలకు ముందు మేం అందరం ఒక్కొక్కరం ఒక్కో అనుభవాన్ని ఎదుర్కొన్నాం. దేశంలో ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే వారిని ప్రజాస్వామ్యమే సరిదిద్దుతుంది. అది భారత రాజ్యాంగం గొప్పదనం. భారత రాజ్యాంగం అందరికీ సమానమే. కోటీశ్వరులకు ఎక్కువ ఓట్లు, సామాన్యులకు ఒక ఓటు... ఉండదు. దేశంలో అందరికీ ఒకటే ఓటు ఉంటుంది. ఆ ఓటే ఈ రోజు దేశాన్ని కాపాడుతోంది. కొన్ని దేశాల్లో పరిస్థితులు చూశాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో దిద్దుబాట్లు జరగవో, నియంతలు పుట్టుకొస్తారు. ఆ నియంతలను సాగనంపడానికి విప్లవాలు కూడా వస్తుంటాయి. ఇటీవలే సిరియాలో చూశాం... అంతకుముందు బంగ్లాదేశ్ లో చూశాం. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం తరచుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి... ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్షగా నిలుస్తోంది. మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి ఎలా సమస్యలను పరిష్కరించేందుకు శ్రమిస్తున్నామో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఇటీవలే ఐటీ మినిస్టర్ (లోకేశ్) అమెరికా వెళ్లారు. గూగుల్ కంపెనీ విశాఖ రావడానికి కృషి చేశారు. అలుపెరగకుండా శ్రమిస్తే ఫలితం వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. పాజిటివ్ గా పాటుపడితే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి. నేను ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. గూగుల్ తో ఒప్పందం చేసుకున్నది దాని గురించే. విశాఖలో భారీ టెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. గూగుల్ వంటి దిగ్గజం విశాఖకు వస్తే వ్యూహాత్మకంగా అదొక గేమ్ చేంజర్ అవుతుంది. ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసి, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్ టెక్ సేవలను అందించగలిగితే.. దాన్ని సీ కేబుల్ తో మిగతా ప్రపంచానికి అనుసంధానం చేయగలిగితే... ఇది గ్లోబల్ సర్వీస్ హబ్ గా తయారవుతుంది. కష్టపడి పనిచేసినప్పుడు ఫలితాలు రాకపోతే ఉపయోగం ఉండదు. అందుకే హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలి. అందుకోసం రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా మార్చాల్సిన అవసరం ఉంది. అయితే నాలెడ్జ్ ఎకానమీకి, నాలెడ్జ్ సొసైటీకి తేడా ఉంది. మున్ముందు ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం" అని సీఎం చంద్రబాబు అభిలషించారు.