రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హెల్మెట్లు ధరించకపోయిన కారణంగా గత మూడు నెలల కాలంలో 667 మంది మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఇలాంటి మరణాల సంఖ్య తగ్గేదని హైకోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల తీరుపై ప్రధాన న్యాయముర్తి ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది.హెల్మెట్లు వాడకపోవడంతో మరణాలు ఎక్కువవుతున్నాయని హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన నేపథ్యంలో ఈ మేరకు హైకోర్టు తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు అనుసరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోకుండా, కఠినంగా రూల్స్ అమలు చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. చలానాలను చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్ చేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తుచేసింది.