ఊరికి అగ్నిమూలన శ్మశానం ఉందని, మరోచోట స్థలం కేటాయించాలని కామారుపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం మండలపరిధిలోని కామరుపల్లిలో తహసీల్దార్ మోహనకుమార్ అధ్యక్షతన మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ కేశవనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలోని పలు సమస్యల ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని కోరారు. గ్రామ సమీపంలో డంపింగ్ యార్డు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు ప్రతిపాదనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విముఖత చూపారని . ఆ స్థలల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. శ్మశాన వాటిక విషయం లో గ్రామస్థులు సమష్టి నిర్ణయానికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ... రెవెన్యూ సమస్యలకు సంబంధించి కోర్టు లో ఉన్నవి తప్ప మిగిలిన అన్నింటిని నిర్దేశిత సమయం లో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ వెంకటనాయుడు, ఆర్ఐ సందీప్, మాజీ జడ్పీటీసీ వేణు గోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, చిన్నంపల్లి సర్పంచు శివశంకర్, ఎంపీటీసీ రజిత, తెలుగు రైతు నియోజకవర్గం అధ్యక్షుడు నారాయణస్వామి, మాజీ సర్పంచు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.