భూవివాదరహిత గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని జేసీ టి.నిషాంతి పేర్కొన్నారు. మంగళవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో అత్యంత పకగ్బంధీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అమలాపురం నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులకు ఆమె కలెక్టరేట్ నుంచి సోమవారం దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లె క్కింపు పూర్తి అయినందున సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ సదస్సుల్లో పరిష్కరిస్తామన్నారు. ఆర్డీవోలు రోజుకు రెండు సదస్సులను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. రీసర్వే జరగని గ్రామాల్లో తొలుత ఈ సదస్సులు నిర్వహించాలని సూచించారు. పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఒక ఆప్షన్ను రెవెన్యూ సదస్సులకు ఇవ్వడం జరిగిందని, దానిలో రోజువారీ ఫిర్యాదులు, పరిష్కార వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారుల బృందం చర్యలు చేపట్టాలన్నారు. క్లిష్టమైన సమస్యలను ప్రొసీజర్ ప్రకారం తదుపరి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ గ్రామంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, భూసమస్యలపై ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారులే జనం వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు.