గుంటూరు వీవీఐటీలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు ఈ గూగుల్ స్కిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కిల్ హబ్ లో భాగంగానే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ముందుగా వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఐటీలో మంచి ఫలితాలు సాధించవచ్చని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గూగుల్ తో ఒప్పందం ద్వారా ఏపీకి అంతర్జాతీయంగా మంచి సంబంధాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపైనా స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగం అని వెల్లడించారు. ఈ బిల్లుకు పార్లమెంటులో అత్యధికులు మద్దతు పలకాల్సి ఉంటుందని తెలిపారు.