ఇవాళ (డిసెంబరు 15) అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ నేపథ్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం ఏర్పాటు చేయగా... సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... త్వరలోనే ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో తాము నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చామని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. నాడు పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు బీజం పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మహనీయుడి ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణాలను సైతం త్యజించిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని వివరించారు.