కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో ఉన్న శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామిని శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆలయ పరిసరాలు, గర్భాలయాన్ని కృష్ణారెడ్డి, సుధ అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహించే పరిస్థితికి వచ్చారని చెప్పారు. వేంకటేశ్వరస్వామికి ఏయే పూజలు జరుగుతాయో వాటన్నింటినీ నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణారెడ్డి, సుధ ఇద్దరూ ఇదే జిల్లాలో పుట్టారని... పీ4 మోడల్ కింద గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోవాలని వీరికి చెప్పానని చంద్రబాబు తెలిపారు. గుడ్లవల్లేరు మండలంలో 14,821 కుటుంబాలు ఉన్నాయని... 51,573 మంది జనాభా ఉన్నారని చెప్పారు. వీళ్ల ఊరు డోకిపర్రులో 2,050 కుటుంబాలు ఉన్నాయని... 5,909 మంది జనాభా ఉన్నారని తెలిపారు. మండలంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 10 నుంచి 15 శాతం కుటుంబాలపై వీరు ఫోకస్ చేస్తారని... అందరి ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలో చేస్తారని చెప్పారు. దీనికి తాము ఒక ఫార్ములా తయారు చేస్తున్నామని... వారికి గైడ్ లైన్స్ కూడా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒక సీఈవోను పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారిని కోరుతున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జిల్లా కలెక్టర్ కూడా వీరికి సహకారం అందిస్తారని తెలిపారు. ప్రభుత్వం తరపున అందాల్సిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతూనే ఉంటాయని... వీళ్లు ప్రణాళికాబద్ధంగా మేనేజ్ చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మరోవైపు, మేఘా కృష్ణారెడ్డిని చంద్రబాబు చెంతకు తీసుకోవడంపై కొందరు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేసేందుకు జగన్ కు మేఘా కృష్ణారెడ్డి వెన్నుదన్నుగా నిలిచారని... అలాంటి వ్యక్తిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడమేంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మనస్తత్వం తొలి నుంచి ఒకే విధంగానే ఉంది. కక్ష సాధింపులు ఆయనకు నచ్చవు. రాష్ట్ర అభివృద్ధే ఆయన లక్ష్యం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గ్రామాలను, విద్యాలయాలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోవాలని ఇటీవలే ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఒక మండలాన్ని దత్తత తీసుకుని, దాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చారు. మండల అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా దీన్ని శుభపరిణామంగానే చూడాలి.