దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. బిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది. ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి ఒకటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్‌లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. దేశంలో ఈ ప్రాజెక్ట్ 10 నగరాల్లో అమలుకానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్నారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచక రహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైనవారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదన్నారు. ఇక్కడి ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతం అవదన్నారు.