ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో గాయపడ్డారు. కుడి కాలు పిక్కలు పట్టేయడంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడారు. ఈ గాయం కారణంగా భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఒకవేళ హేజిల్‌వుడ్ దూరమైతే ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ కుడి కాలు పిక్కలు పట్టేయడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. "అతను మిగిలిన టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది" అని తెలిపింది. మంగళవారం కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, టీమ్ ఫిజియో నిక్ జోన్స్‌తో చర్చించిన తర్వాత హేజిల్‌వుడ్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈరోజు కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. హేజిల్‌వుడ్ గాయం తీవ్రతను తెలుసుకోవడానికి స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు సీఏ తెలిపింది. కాగా, సోమవారం నాడు ఓ అద్బుతమైన బంతితో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఇక అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌కు కూడా గాయం కారణంగానే ఈ స్టార్ పేసర్ దూరమయ్యాడు. ఇప్పుడు మూడో టెస్టుకు పేసర్ స్కాట్ బోలాండ్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చాడు.