వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ వైద్య విద్యార్థులను ప్రశంసించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవాన్ని బుధవారం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. ఏదైనా ఉన్నత విద్యా సంస్థ ప్రారంభమైన తర్వాత.. అందులోని మొదటి బ్యాచ్ సదరు సంస్థకు గుర్తింపు తీసుకొస్తారని అన్నారు. వైద్య రంగంలో, సమాజంలో, దేశ, విదేశాల్లో మంగళగిరి ఎయిమ్స్ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులే ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని ఆమె కొనియాడారు.
విజయం, గౌరవం సాధించడానికి.. సేవ, అభ్యాసం, పరిశోధన అనే మూడు విషయాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. కీర్తి, అదృష్టంలో కీర్తికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, దానినే ఎంచుకోవాలని చెప్పారు. భారతీయ వైద్యులు తమ ప్రతిభ, కృషితో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రగామిగా నిలిచారని గుర్తుచేశారు. మన దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇతర దేశాల ప్రజలు భారతదేశాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. ఇండియా ప్రపంచంలో మెడికల్ టూరిజానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, ఇందులో వైద్యులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మన సంప్రదాయంలో దీర్ఘాయువు, ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రార్థిస్తామని అన్నారు. ‘సకల స్వాస్థ్య సర్వదా’ అనేది మంగళగిరి ఎయిమ్స్ నినాదమని గుర్తుచేశారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిరంతరం ప్రోత్సహించడం, అందరికీ ఆరోగ్యం అందించడాన్ని ఎయిమ్స్‌లో ప్రతి వైద్యుడూ మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని సూచించారు.