పెనుకొండ మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పాఠశాలలో 228 మంది విద్యార్థినులు చదువుతున్నారు. సోమవారం రాత్రి 6.30 గంటలకు హాస్టల్‌లో వండిన అన్నం, సాంబార్ తిన్నారు. ఒక గదిలో ఉంటున్న కొంతమంది విద్యార్థినులకు వాంతులు అయ్యాయి. వారిని హుటాహుటిన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మందిలో 12 మంది ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఆరో తరగతి విద్యార్థిని మహేశ్వరి మాత్రం అడ్మిషనలో ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి మంజువాణి, తహసీల్దార్ శ్రీధర్, ఎంఈఓ సుధాకర్.. పాఠశాలకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. అందరూ క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలలో మంగళవారం ఉదయం నుంచి గుట్టూరు పీహెచసీ వైద్యాధికారి నాగరాజునాయక్ సిబ్బందితో వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు.