ఓటరు జాబితాలో తప్పులు, చిరునామాల మార్పు, కొత్తగా జాబితాలో చేర్చడం వంటి అర్జీలు ఇచ్చుకున్నవారి ఇళ్లకు అనంతపురం కలెక్టరు వినోద్‌కుమార్ మంగళవారం నేరుగా వెళ్లారు. జనవరి నెలలో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు ఓటర్ల నుంచి వివిధ రకాల మార్పుల కోసం 6, 7, 8 దరఖాస్తు ఫారాలు తీసుకున్నారు. వాటిని పరిశీలించి తగిన విధంగా సవరించాల్సిఉంటుంది. దీనికోసం బీఎల్‌ఓలు క్లెయిమ్‌లు ఇచ్చుకున్నవారి ఇంటి వద్దకు వెళ్లి వారితో మాట్లాడి పక్కా సమాచారం తీసుకొని అపుడు సవరించాల్సి ఉంటుంది. ఈపక్రియను కలెక్టరు జిల్లాకేంద్రంలోని ఆర్కేనగర్, 6వరోడ్డు, ఎంజీకాలనీలలో పరిశీలించారు. అర్జీదారుల ఇళ్లవద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. మీఇంటికి బీఎల్‌ఓలు వచ్చారా? మీకు ఓటు హక్కు ఎక్కడ కావాలి? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ఇళ్ల వద్ద లేకపోవడంతో ఫోనలో వీడియోకాల్ చేసి తాను కలెక్టర్‌నని, మీరు ఓటు మార్పుకు దరఖాస్తు చేసుకున్నారా? పరిశీలనకు బీఎల్‌ఓలు వచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతిక్లెయిమ్ ఇంటికి తప్పనిసరిగా వెళ్లి వారితో మాట్లాడిన తర్వాతనే సవరణలు చేయాలని, అందుకు విరుద్ధంగా చేశారని తెలిస్తే చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు.