రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరేళ్ల క్రితం(2018లో) పెంచిన ధరలు ఇప్పుడు గిట్టుబాటు కావట్లేదని ఆప్కో ఎండీ ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల దుస్తుల ధరలు పెంచింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ శాఖలు ఒక విద్యార్థి చొక్కా (91 సెం.మీ వస్త్రం) ధర రూ.67.10, ప్యాంట్ (137సెం.మీ వస్త్రం) రూ.143.60 చొప్పున చెల్లిస్తున్నాయి. విద్యార్థినులకు లంగా(113 సెం.మీ) ధర రూ.78.70 ఇస్తున్నాయి. ఈ ధరలు గిట్టుబాటు కావడం లేదని ఆప్కో ఎండీ చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు సర్కారు విద్యార్థి చొక్కా వస్త్రం ధర రూ.98.90; ప్యాంట్ వస్త్రం రూ.175.40; విద్యార్థినుల లంగా ధర రూ.116.30కు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఈ ధరలు వర్తిస్తాయంటూ, ఇకపై ఏటా పది శాతం చొప్పున పెంచుకోవడానికి అనుమతిచ్చింది. చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ శాఖలు ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.