ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పడవలోని మరో 66 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమాచారం రాగానే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.గట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు ప్రయాణికులతో వెళుతున్న 'నీల్ కమల్' పడవ మునిగిపోయింది. ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రమాద సమయంలో ఈ పడవలో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.