దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్య బ్యాంక్ (Karur Vysya Bank) తమ వ్యాపార విస్తరణ వేగంగా చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాల్లో కొత్త శాఖలు ప్రారంభించిన కేవీబీ ఈసారి మరో నగరంలో తమ సేవలను మొదలు పెట్టింది. అలాగే తెలంగాణలోనూ మరో కొత్త బ్రాంచును తెరిచినట్లు తెలిపింది. తమ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో కొత్త బ్రాంచీలు తెరిచారో తెలుసుకుందాం.
ఏపీలోని ఆ నగరంలో..
కరూర్ వైశ్య బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. అనంతపురంలోని కల్యాణదుర్గం మెయిన్ రోడ్‌లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈ బ్రాంచ్‌ను ఓపెన్ చేశారు. ఇక డిసెంబర్ తొలి వారంలోనే ఏపీలోని విశాఖపట్నం, కడపలో రెండు కొత్త శాఖలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనంతపురాన్ని ఎంచుకుంది. తమ వ్యాపర విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త శాఖాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.
ఇక తెలంగాణలోని నిజమాబాద్‌లో కొత్త శాఖ ప్రారంభించినట్లు కరూర్ వైశ్య బ్యాంక్ తెలిపింది. హైదరాబాద్ రోడ్ లోని వినాయక నగర్‌లో కొత్త బ్రాంచ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండింటితో కలిపి బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 864కు పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో 26 కొత్త శాఖాలను ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. డిసెంబర్ తొలివారంలో ఏపీలో 2, తమిళనాడులో 2 కొత్త బ్రాంచులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైలోనే 2 కొత్త శాఖలను అందుబాటులోకి తేగా.. ఏపీలోని కడప, వైజాగ్, ఇప్పుడు అనంతపురంలో కొత్త బ్రాంచీలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బ్యాంకుకు 2,200 ఏటీఎం కేంద్రాలు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక ఏడాదిలో అత్యధిక నెట్ ప్రాఫిట్ రూ.1605 కోట్లు మేర వచ్చినట్లు పేర్కొంది.