ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ తగ్గట్టు అందరూ మారాల్సిందే. అయితే అది ఎలాంటి ట్రెండ్ వైపు వెళ్తున్నాం. అది సమాజానికి, మనకు ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కొందరు మాత్రం ఫారిన్ కల్చర్, అప్‌డేటెడ్ ట్రెండ్ అంటూ వింత వింత పోకడలకు పోతున్నారు. అయితే గతంలో మనం భార్యల మార్పిడి కేసులు విన్నాం కదా.. ఇప్పుడు కూడా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఈసారి భార్యలు కాకుండా లవర్స్ మార్పిడి చేసుకుంటుండగా.. ఓ మహిళ బయటికి వచ్చి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నడుస్తున్న ఈ యవ్వారం తాజాగా బయటికి వచ్చింది.
తనను బలవంతంగా వేరే వ్యక్తితో శృంగారం చేయాలని తాను ప్రేమించిన వాడే తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు ఓ మహిళ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హరీష్, హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరీష్, హేమంత్‌లు ప్రైవేట్ పార్టీల పేరుతో ఈ లవర్స్ మార్పిడి గేమ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి కూడా వీరిద్దరిలో ఒకరి లవర్ అని వెల్లడించారు. మహిళలను బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ.. అత్యాచారాలు చేస్తున్నట్లు తేలింది.
ఈ ఇద్దరు నిందితులు.. వారికి తెలిసిన వారితో శృంగారంలో పాల్గొనాలని, వారితో సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశారని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. అయితే తాను మొదట అందుకు నిరాకరించడంతో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని వారు బెదిరించినట్లు వాపోయింది. చివరికి వారికి తలొగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. గతంలోనూ ఇలాంటి కార్యకలాపాలు సాగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ యువతి నమ్మకాన్ని వీళ్లిద్దరూ దుర్వినియోగం చేశారని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని వారు బలవంతం చేశారని.. అందుకు ఆమె నిరాకరించడంతో ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. బెంగళూరు శివార్లలో ఇలాంటి ప్రైవేట్ పార్టీలను నిర్వహించేందుకు నిందితులు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా బాధితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు నిందితులు పలువురు మహిళలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను దాచిపెట్టారని.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.