జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్‌లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్‌లోని జైపుర్‌లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్‌ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్‌లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్‌పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్‌కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. 'నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు.