టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి భార్య మేహా పటేల్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ పటేల్ నేడు (డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తనకు కుమారుడు పుట్టాడనే విషయాన్ని ప్రత్యేకమైన విధంగా పంచుకున్నాడు ఈ గుజరాతీ ప్లేయర్. తన కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డిసెంబర్ 19న తాము మొదటి బిడ్డకు బిడ్డకు స్వాగతం పలికినట్లు అక్షర్ పటేల్ వెల్లడించాడు. ఇదే సమయంలో తమ బిడ్డ పేరును సైతం వెల్లడించాడు ఈ ఆల్‌రౌండర్. తమ మొదటి సంతానానికి ‘హక్ష్ పటేల్’ అని పేరు పెట్టినట్లు అక్షర్ తెలిపాడు. అక్షర్ పటేల్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత క్రికెటర్ అక్షర్ పటేల్.. గతేడాది జనవరిలో వడోదరలో మేహా పటేల్‌ను పెళ్లాడాడు. ఇక అక్షర్ పటేల్, మేహా చాలా కాలంగా స్నేహితులు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. 2022 జనవరి 20న అక్షర్.. పుట్టిన రోజున వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మేహా డైటిషియన్, న్యూట్రియనిస్టుగా పని చేస్తున్నారు. డీటీ మేహా పేరిట ఓ సొంతంగా వెంచర్ నడుపుతున్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేహాకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడమంటే ఇష్టం. ఆమె తన చేతిపై ‘Aksh’ అనే అక్షరాలను టాటూ వేయించుకున్నారు.
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో అప్పుడే చాలా మంది అక్షర్ పితృత్వ సెలవుల్లో ఉన్నట్లు భావించారు. అందుకే అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదట. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ.. భారత్ తరఫున అక్షర్ మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.