కజకిస్తాన్‌లో విమానం కుప్పకూలిపోయింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం.. గాల్లో ఉండగా పైలట్ నియంత్రణ కోల్పోవడంతో నేరుగా భూమిపైకి దూసుకువచ్చింది. ఈ క్రమంలోనే భూమికి తాకగానే పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సిబ్బంది కలిసి మొత్తం 110 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఆ విమానం.. ప్రమాదానికి గురైనట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. అజర్ బైజాన్‌కు చెందిన విమానం ఆ దేశ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. గ్రోజ్నిలో దట్టంగా ఏర్పడిన పొగమంచు కారణంగా.. విమానం ల్యాండ్ కాలేకపోయిందని.. ఈ క్రమంలోనే ఆ విమానాన్ని దారి మళ్లించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే గ్రోజ్నీకి దగ్గర్లో ఉన్న కజకిస్తాన్‌లో ల్యాండింగ్‌కు ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే కజకిస్తాన్ ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న ఆ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆ విమానాన్ని కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. చివరికు ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయిందని రష్యా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ఈ ఘటన జరిగిన సమయంలో దగ్గర్లో ఉన్న కొందరు స్థానికులు.. విమానం కూలిపోతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విమాన ప్రమాదంలో సరిగ్గా ఎంత మంది చనిపోయారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే.. అందులో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశాలు కనిపించడం లేదు.