ఈ మధ్య కాలంలో పిల్లలను పెంచడం చాలా సవాలుగా మారింది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల పిల్లలను సరైన రీతిలో పెంచలేకపోతున్నారు.వారికి సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అలాగే క్రమశిక్షణ నేర్పించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ మొండిగా, కోపంగా మారుతున్నారు. వారిని అదుపులో ఉంచడం, చెప్పిన మాటను వినేలా చేయడం సవాలుగా మారుతోంది.దీంతో పిల్లల మొండితనం ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. అయితే పిల్లలు తమ మాట వినేలా చేయాలంటే తల్లిదండ్రులు వారిపట్ల వ్యవహరించే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల పిల్లల తీరులో మార్పు వస్తుంది. అలాగే పిల్లలు మొండిగా కాకుండా మృదువుగా మారతారు. ఆ జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల మొండితనం పోవాలంటే వారితో సానుకూలంగా మాట్లాడాలి. వారిని భయపెట్టడం, బెదిరించడం, వాదించడం, వారిని కొట్టడం వంటివి చేయకూడదు. పిల్లలకు చెడు అలవాట్లపై ఒక అవగాహన కల్పించాలి. ఒకవేళ వారుతప్పుగా ప్రవర్తిస్తున్నట్లైతే.. వారికి మంచి ఎదో చెడు ఎదో ఒక స్నేహితుడి మాదిరిగా చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల వారికి మంచి చెడులపై అవగాహనతో పాటు మొండితనం కూడా వెళ్ళిపోతుంది.
ప్రోత్సాహం అందించండి..
పిల్లలకు రూల్స్ పెట్టడం, బెదిరించడం కఠినంగా వ్యవహరించడం వల్ల వారు ఒత్తిడికి లోనవుతారు. దీని కారణంగా వారు ఒంటరిగా ఉన్న సమయాల్లో కలత చెందుతారు. అందుకే పిల్లలను అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలి. వారిని ప్రతి పనిలోనూ ప్రేరేపించాలి. బాగా చదివితే బహుమతులు ఇవ్వడం, లేదా కొనిస్తామని చెప్పడం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో మంచి ప్రవర్తన, మంచి ప్రదర్శన కారణంగా బహుమతులు దొరుకుతాయని నమ్మకం ఉంటుంది.
నో అంటే నో
పిల్లలకు ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టినపుడు ఆ రూల్స్‌కు కట్టుబడి ఉండాలి. ఒకసారి నో చెప్పిన మాటపై లేదా వ్యవహారంపై నో అంటే నో అనే ధోరణితో ఉండాలి. వారు ఎంత మారం చేసినా, ఎంత ఏడ్చినా, వారికి ఒత్తిడికి లొంగకూడదు. మీరు లోగిపోతే ఆ రూల్స్‌కు విలువ ఉండదు. ప్రతీసారి ఇలానే చేసే అవకాశం ఉంది. మరింత మొండిగా మారే ప్రమాదం ఉంది.
ప్రశాంతంగా వ్యవహరించండి
పిల్లలు మొండిగా ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ ఓపికను కోల్పోతుంటారు. ప్రశాంతంగా లేకుండా కఠినంగా వ్యవహరిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలపై అరుస్తుంటారు. వారిని కొడతారు కూడా. పిల్లల పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇంకా మొండిగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లలు మొండితనం ప్రదర్శించేటప్పుడు భావోద్వేగాలకు లోనవకుండా ప్రశాంతంగా ఉంటూ వారి చర్యలపై స్పందించాలట. ప్రశాంతంగా ఉంటూ వారిని మార్చే ప్రయత్నం చేయాలట.ఈ రూల్స్ పాటించడం వల్ల పిల్లల మొండితనం కోపం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వారు తల్లిదండ్రుల మాట వింటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో మార్పులు కనిపిస్తాయని, పిల్లలు కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు