కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. కోట్లాది మంది పాల్గొనే ఈ మహా వేడుకకు అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తు్న్నాయి. కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ.. కుంభమేళాలో పాల్గనడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు సర్వీసును రద్దు చేసింది. 07657 నంబరుతో నడిచే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు, 07658 నంబరుతో నడిచే హుబ్లీ - తిరుపతి ప్యాసింజర్ రైలును దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కుంభమేళా సందర్భంగా రెండు నెలల పాటు తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుంభమేళా కారణంగా రెండు నెలల పాటు ఈ రైలును రద్దు చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. తిరుపతి హుబ్లీ ప్యాసింజర్ రైలుకు 22 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు ద్వారా రోజుకు రూ.3.5 లక్షల వరకు ఆదాయం వస్తోంది. తిరుపతి హుబ్లీ మధ్య 62 రైల్వేస్టేషన్లలో దీనికి స్టాంపింగ్ ఉంది. తిరుపతిలో బయల్దేరి.. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల మీదుగా కర్ణాటక చేరుకుంటుంది ఈ రైలు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల మీద నుంచి వెళ్తుండటంతో గ్రామీణ ప్రజల నుంచి ఈ రైలుకు బాగా డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ రైలును రెండు నెలల పాటు రద్దు చేయడంతో ఆ ప్రాంతవాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
మరోవైపు తిరుపతి - కదిరిదేవరపల్లి రైలును, గుంతకల్లు - తిరుపతి రైలును కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. డిసెంబర్ 28 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబర్ 28 నుంచి ఈ రైలు సర్వీసులను ఈ మార్గంలో రద్దు చేసి.. కుంభమేళాకు పంపించనున్నారు. రెండు నెలల తర్వాతే ఈ రైలు సర్వీసులు తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
అయితే కుంభమేళాకు లక్షల మంది జనం వస్తుంటారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆరు రైళ్లను కుంభమేళాకు పంపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు అర్థం చేసుకోవాలని.. ఈ మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.