ఆ అన్నదాత కష్టం పగవాడికి కూడా రావొద్దు. ఎంతో శ్రమించి పంటను పండించుకున్నప్పటికీ ఆ రైతుకు కష్టాలే మిగిలాయి. తన వద్ద ఉన్న ఎకరన్నర పొలంతో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో వేరే వారి పంటను కౌలుకు తీసుకున్నాడు.ఎంతో కష్టపడి పంటను సాగు చేశాడు. తన శక్తికి మించి అప్పులు చేసిన మరి పంట సాగు చేశాడు. కానీ చివరకు ఆ అన్నదాతకు అప్పులే మిగిలాయి తప్ప పంట చేతికి రాని పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియక ఓ కఠిన నిర్ణయానికి వచ్చాడు ఆ రైతు. తాను లేకపోతే తన కుటుంబం కూడా ఆగమవతదని భావించాడో ఏమో కుటుంబంతో సహా ఆ రైతు చేసిన పని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కడప జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అప్పుల బాధ తాళలేక అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నాగేంద్రకు సొంతంగా ఒకటిన్నర భూమి ఉంది. అయితే సొంత భూమితో పాటు 15 ఎకరాలు వేరే వారి భూములను కౌలుకు తీసుకున్నాడు నాగేంద్ర. పొలాన్ని సాగు చేసేందుకు మితిమీరి అప్పు కూడా చేశాడు. అప్పులు చేసి సాగు చేసిన పంటలో భారీ నష్టం రావడంతో రైతు కృంగిపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు. మరోవైప్పు అప్పు తీర్చే మార్గం లేక.. అప్పులు కట్టాలని ఒత్తిడి ఎక్కువవడంతో మానసికంగా నలిగిపోయాడు. చివరకు తనకు చావే శరణ్యం అని భావించాడు ఆ రైతు.
కానీ తాను చనిపోతే తన కుటుంబం ఇబ్బందులు పడుతుందని భావించిన నాగేంద్ర.. భార్య, పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పగా ఆమె కూడా ఎంతో మనోవేదనకు గురైంది. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. నాగేంద్ర, వాణి దంపతులతో వారి ఇద్దరు పిల్లలకు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నారు. ముందుగా పిల్లలకు ఉరివేసిన తరువాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట చేను గేటుకు ఉరి వేసుకుని అన్నదాత కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నదాత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.