పంజాబ్ ప్రభుత్వంతో పాటు అక్కడి రైతు సంఘాల నాయకులపై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సర్కారుకు అనేక సూచనలు చేసింది. నెల రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఒప్పించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. అలాగే రైతు సంఘాల నాయకులు ఎవరూ దీన్ని అడ్డుకోవద్దని చెప్పింది. నిజంగానే వాళ్లు దల్లేవాల్ మంచి కోరుకుంటే ఆయన ఆస్పత్రికి వెళ్లేలా చూడాలంటూ జస్టిస్ సూర్యకాంత్ హితవు పలిపారు.
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ - హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద దీక్ష చేపట్టిన ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రైతు సంఘాల నాయకుల మాత్రం.. ఆయన దీక్షకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఈ కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.
ఇటీవలే ఓ వ్యక్తి దల్లేవాల్‌కు వైద్య సాయం అందిచాలన్న ఆదేశాలను అమలు చేయకుండా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు వ్యతిరేకంగా ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈరోజు సుప్రీం కోర్టు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే న్యాయస్థానం పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దల్లేవాల్‌కు వైద్య సాయం అందించడానికి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడానికి అనుమతించినందుకు గాను సర్కారును నిలదీసింది.
ముఖ్యంగా నెల రోజులు అవుతున్నా దల్లేవాల్‌ను ఎందుకు ఆస్పత్రికి తరలించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి స్పందించారు. దల్లేవాల్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుంటే రైతు సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారని.. రైతుల నుంచి భారీ ప్రతిఘటన ఎదుర్కుంటున్నట్లు చెప్పారు. దీంతో సుప్రీం కోర్టు రైతు సంఘాల నాయకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా వాళ్లు ఆయన క్షేమం కోరుకునే వాళ్లే అయితే.. ఆయనను ఆస్పత్రికి తరలించడానికి సహకరించాలని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు.
అలాగే డిసెంబర్ 31వ తేదీలోపు దల్లేవాల్‌ను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఒప్పించాలని పంజాబ్ ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏమైనా సాయం అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని స్పష్టం చేసింది. కేసును డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.